ఘనంగా అమర రాజా గ్రూప్ 40వ ఫౌండేషన్ డే వేడుకలు
తిరుపతి: విభిన్న రంగాల్లో విశేష సేవలందిస్తూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన అమర రాజా గ్రూప్ తన 40వ ఫౌండేషన్ డే వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించింది. 1985లో అమర రాజా పవర్ సిస్టమ్స్గా ప్రారంభమైన ఈ గ్రూప్, నేడు 6 కంపెనీలు, 17 వ్యాపార విభాగాలు మరియు 21,000కు పైగా ఉద్యోగులతో దేశీయంగా మరియు అంతర్జాతీయంగా విశ్వసనీయ సంస్థగా ఎదిగింది. ఫౌండేషన్ డే వేడుకల సందర్భంగా, సమాజాభివృద్ధి పట్ల తన నిబద్ధతను చాటుతూ అమర రాజా గ్రూప్ ‘అమర రాజా బెటర్ వే అవార్డ్స్’ విజేతలను ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన ముగ్గురు గ్రామీణ వ్యాపార సంస్థలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల నగదు బహుమతితో పాటు, వారి వ్యాపారాభివృద్ధికి ఒక సంవత్సరం పాటు మార్గదర్శకత్వం మరియు సహకారం అందించనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా అమర రాజా గ్రూప్ చైర్మన్ జయదేవ్ గల్లా మాట్లాడుతూ, “ఈ ఏడాది ‘ఫారెవర్ త్రూ టైమ్’ అనే థీమ్ మా నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. పరిశ్రమలను పునర్నిర్వచిస్తూ, వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా భవిష్యత్తు వైపు దృఢంగా ముందుకు సాగుతున్నాం” అని తెలిపారు. 


ఈ వేడుకల్లో భాగంగా, అమర రాజా గ్రూప్ దాదాపు 300 మంది ఉద్యోగులకు ఛాంపియన్ అవార్డ్స్ మరియు లాంగ్ సర్వీస్ అవార్డ్స్ అందించి సత్కరించింది. అలాగే, సంస్థకు గత నాలుగు దశాబ్దాలుగా సహకారం అందిస్తున్న సమీప గ్రామాల పంచాయతీ నాయకులను గౌరవించింది. అమర రాజా ఉద్యోగుల పిల్లలకు బెస్ట్ స్టూడెంట్ అవార్డ్స్ అందించగా, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమానికి అమర రాజా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డా. రామచంద్ర నాయుడు గల్లా, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, అమర హాస్పిటల్ ఎండీ డా. రమాదేవి గౌరినేని, అమర రాజా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు హర్షవర్ధన్ గౌరినేని, విక్రమాదిత్య గౌరినేని, గ్రూప్ ఆపరేషన్స్ హెడ్ నరసింహులు నాయుడు, పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
