జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే వ్యవసాయ శాఖలో జరిగిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు లేదా అసెంబ్లీ కి రావాలని సవాల్ విసిరిన : మంత్రి అచ్చెన్న
జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే వ్యవసాయ శాఖలో జరిగిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు లేదా అసెంబ్లీ కి రావాలని సవాల్ విసిరిన మంత్రి అచ్చెన్న

అమరావతి: రాష్ట్రానికి మంచి చేయడానికంటే అబద్ధాల ప్రచారమే ముఖ్యమని భావించే జగన్ రెడ్డి, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడేంత నైతిక స్థాయి కూడా లేనివారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజలకు చేసిన మోసాలు, మాట తప్పటం, వాగ్దానాలన్నింటినీ మర్చి ఇప్పుడు నీతిమంతుడిగా నటించడం జగన్ స్వభావమని ఆయన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. పాలన అంటే ఏమిటో కూడా తెలియని జగన్, నాలుగేళ్ల లోపే రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడని అన్నారు. రైతు, మహిళ, యువత, ఉద్యోగులు ఎవరినీ సంతోషపెట్టని పాలన జరిపే నాయకుడు ఇప్పుడు నైతిక విలువలు చెబుతుండటం ప్రజలను నవ్వించే విషయం అని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు విదేశీ పర్యటనలు చేస్తుంటే ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేని జగన్ పిచ్చిపిచ్చి ఆరోపణలు చేయడం సముచితం కాదని హెచ్చరించారు. నారా లోకేష్ టెక్నాలజీ, పరిపాలన, పారదర్శకతను రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తుంటే, నాలుగేళ్లలో ఒక్క మంచి నిర్ణయం కూడా తీసుకోలేని జగన్, లోకేష్‌పై మాట్లాడటం హాస్యాస్పదమని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన పాలకుడిగా జగన్ గుర్తింపు, వ్యవసాయ రంగం నుండి పరిశ్రమల వరకు చీకటి దశకు నెట్టిన దోషిగా ప్రజల తీర్పులో నిలిచిపోయారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతుల కష్టాలు పెరిగినా, యువతకు ఉద్యోగాలు రాకపోయినా, ప్రభుత్వ ఉద్యోగులకు హక్కులు దక్కకపోయినా జగన్ మాత్రం నాటకాలు, అబద్ధాలు, ప్రచారాలు మాత్రమే చేశాడు అని విమర్శించారు. అందరి మీద ఆరోపణలు చేసి తానే నీతిమంతుడిగా నటించే రాజకీయాలు జగన్‌కి అలవాటయిపోయాయి, కానీ రాష్ట్ర ప్రజలు ఆ డ్రామాలను ఇక నమ్మే పరిస్థితిలో లేరని హితవు పలికారు. ప్రస్తుతం చంద్రబాబు లోకేష్ జంట రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదులు వేస్తున్నప్పుడు, జగన్ వంటి మాటల నాయకులు చేసే ఆరోపణలు పని చేయవని, ప్రజలు నిజం ఏంటో బాగా అర్థం చేసుకున్నారని తెలిపారు. దమ్ము-ధైర్యం ఉంటే జగన్ గత ప్రభుత్వం లో జరిగిన వైఫల్యాలు, కూటమి ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి పై, నిజాల గురించి బహిరంగ చర్చకు రావాలి అని సవాల్ విసిరారు. అబద్ధాలతో రాజకీయాలు చేసే వారి కాలం ముగిసింది, నిజాయితీ పాలనకు ప్రజలు అండగా నిలిచారు అని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌ల వంటి అభివృద్ధి నాయకులపై మాటలు మాట్లాడటానికి ముందు జగన్ తన నాలుగేళ్ల దారుణ పాలనను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని అన్నారు.
జగన్ అబద్దాలతో ప్రజల్ని మభ్య పెట్టలేడు నిజాలని దాచలేడు:
జగన్ మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని తప్పుడు కథనాలు పేర్చినా ప్రజలు ఇక మభ్యపడరని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. జగన్ తరచూ వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నా, ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న చర్యలు ప్రజలు స్వయంగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రైతుల పంటలకు భరోసా ఇవ్వడం, నష్టపోయిన పంటలకు వెంటనే ఆర్థిక సహాయం అందించడం, మార్కెట్ జోక్యంతో కనీస మద్దతు ధర కంటే తక్కువకు పంటలు అమ్ముడు కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన పనులను, అమలు చేస్తున్న సంస్కరణలను మాయమాటలతో ఎవరూ కించపరచలేరని మంత్రి అచ్చెన్నాయుడు ధీటుగా చెప్పారు. అసత్యాలు ఎంత పెద్దగా చెప్పిన, ఎంతసేపు ప్రచారం చేసిన, నిజం ముందు అవి నిలవవని ఆయన అన్నారు. ప్రజలకు నిజాయితీతో చేసిన పని, రైతులకు అందించిన సహాయం, గ్రామాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్న అభివృద్ధి—ఇవి అన్నీ జగన్ చేస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అబద్ధాలతో దారితప్పించే ప్రయత్నం చేయడం ప్రజలే తిరస్కరించే విషయం అని ఆయన హెచ్చరించారు.
2019 తర్వాత ఉచిత భీమా పరిణామాలు:
ఖరీఫ్ 2019 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్వంతంగా బీమా సంస్థను ఏర్పాటు చేసి పంటల బీమా పథకం అమలు చేయాలనే ప్రయత్నం చేసినా, అది పూర్తిగా విఫలమైంది. రబీ 2018-19 తర్వాత రైతులకు ఏ రబీ సీజన్లోనూ కూడా ఎలాంటి బీమా పరిహారం చెల్లించలేదు. ఆ తరువాత ఉచిత పంటల బీమా పథకాన్ని నామమాత్రంగా ప్రకటించి ఖరీఫ్ 2020, ఖరీఫ్ 2021 సీజన్లలో మాత్రమే అమలు చేసి, సంబంధించిన బీమా పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. ఆపై కేంద్ర ప్రభుత్వ ప్రీమియం సబ్సిడీని పొందేందుకు PMFBYతో సంయుక్తంగా ఉచిత బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి, రైతు ప్రీమియం మరియు రాష్ట్ర సబ్సిడీ రెండింటినీ ప్రభుత్వం తానే బీమా కంపెనీలకు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని ఖరీఫ్ 2022 తర్వాత గాలికి వదిలివేసి ప్రీమియం సబ్సిడీ చెల్లింపులో ప్రభుత్వం తీవ్రమైన ఆలస్యం చేసింది. ఈ నిర్లక్ష్యం కారణంగా రబీ 2022- 23 నుండి రైతులకు బీమా పరిహారం సరైన సమయానికి చెల్లించలేక, రైతులు తీవ్రంగా నష్టపోయారు. మే 2019 తర్వాత వచ్చిన రబీ 2018-19 క్లెయిమ్‌లు ఒక సంవత్సరం తర్వాత అంటే జూన్ 2019 బదులు జూన్ 2020లో పరిష్కరించబడ్డాయి.
రబీ 2022-23 నుండి సబ్సిడీని బీమా కంపెనీలకు ఇంకా చెల్లించలేదు.
ఈ క్రాప్ ఖరీఫ్ 2023 సంలో 46 లక్షల మంది రైతులు 93 లక్షల ఎకరాలకు ఈ క్రాప్ చేయించుకున్నారు. ఖరీఫ్ 2024 లో 41 లక్షల మంది రైతులు 96 లక్షల ఎకరాలకు ఈ క్రాప్ చేయించుకున్నారు. ఖరీఫ్ 2025 లో 51 లక్షల మంది రైతులు 1 కోటి 13 లక్షల ఎకరాలకు ఈ క్రాప్ చేయించుకున్నారని మంత్రి తెలిపారు.
గిట్టుబాటు ధరలు రైతులు పండించిన పంటల కొరకు ధరల స్థిరీకరణ ఏర్పాటు అంటూ 3000 కోట్లు ఖర్చు పెట్టాము అని అంటావు అవి ఏ జిల్లాలో ఏఏ పంటలకు ఇచ్చారు, ఎంత మంది రైతులకు ప్రయోజనం జరిగిందో లెక్కలు చెప్పే దమ్ము జగన్ కు ఉందా అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జిల్లా ఉన్నతాధికారులు కిందిస్థాయి ఉద్యోగులు వేగంగా పనిచేయాలని, పనులు త్వరితగతిన అవ్వాలని తక్కువ వ్యవధిని ఇస్తారు ఆ విషయాన్ని కూడా తప్పుబట్టాల్సిన అవసరం లేదని జగన్ కి మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా పంట నష్టం నమోదు జరగలేదని, అధికారులు రైతులని కలవలేదని, పొలాల్లో పర్యటించలేదని అసత్యాలు చెప్తున్న జగన్ రెడ్డి కళ్ళు , చెవులు పెద్దవి చేసుకుని చూడాలని, వినాలని అన్నారు. రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నాడని, ఇప్పటివరకు రాష్ట్రంలో 1,58,872 దెబ్బతిన్న ఎకరాలను అధికారులు గుర్తించారని మంత్రి తెలిపారు. ఈ రోజు కూడా జగన్ పర్యటించిన ప్రాంతమైన గూడూరు మండలంలో 289 రైతులకు చెందిన 158 హెక్టార్లలో పంట నమోదు జరిగిందని తెలిపారు. జగన్ వచ్చే ముందు రామరాజుపాలెం గ్రామంలో 20 ఎకరాల నమోదు జరిగిందని మంత్రి తెలిపారు. పంట నమోదు లేదంటూ జగన్ ప్రచారం చేయటం అతని అజ్ఞానానికి నిదర్శనం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
తుఫాన్ సమయంలో ప్రజలకు అండగా నిలిచిందా జగన్ పార్టీ? ఒక్క వాటర్ ప్యాకెట్ కూడా పంపించలేదు. ఐదేళ్లు పాలనను, రైతులను గాలికొదిలేసి… ఇప్పుడు పర్యటనల పేరుతో మొక్కుబడిగా తిరగడం విడ్డూరం కాదు మరి?” అని మంత్రి ప్రశ్నించారు.మొంథా తుఫానులో రైతులకు జగన్ పార్టీ ఒక్క పైసా కూడా సహాయం చేయలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం గోదావరి వరదలు, తుఫాన్లలో ముంపు మండలాల రైతులకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించింది. కానీ జగన్ రెడ్డి అయితే పరామర్శకు కూడా రాలేదు, అన్నారు. మూడు సంవత్సరాల పాటు రైతుల బీమా ప్రీమియంనే జగన్ ప్రభుత్వం దోచుకుందని కేంద్ర వ్యవసాయ మంత్రి పార్లమెంట్లో స్వయంగా చెప్పారు. రైతులను మోసం చేస్తూ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడంతో చంద్రబాబు గారి నిరసన తరువాత హడావుడిగా రూ.590 కోట్లు విడుదల చేయాల్సి వచ్చింది,” అని వివరించారు.
రాష్ట్రంలో బీమా పరిస్థితి:
2020–21 నుంచి 2024–25 మధ్యకాలంలో ప్రధానమంత్రి ఫసలీమా యోజన మరియు WBCIS కింద వచ్చిన రూ.3,138.80 కోట్ల క్లెయిమ్‌లలో పెద్ద భాగం చెల్లించలేదు జగన్ ప్రభుత్వం. ఇక కూటమి ప్రభుత్వం వచ్చి ఈ పంటకాలం నుంచే తక్కువ ప్రీమియంతో రైతులకు బీమా అందిస్తోంది. రాష్ట్రం–కేంద్రం కలిసి సబ్సిడీ భరిస్తున్నాయి. ఇప్పటికే 97% ఈ-క్రాప్ నమోదు పూర్తయ్యింది అన్నారు.
గత ప్రభుత్వ కాలంలో రైతుల పట్ల నిర్లక్ష్యo:
“తుఫానులు, వర్షాభావం వచ్చినప్పుడల్లా జగన్ రెడ్డి గాలి పర్యటనలకే పరిమితం. నేలమీదికి ఎప్పుడూ దిగలేదు. తొమ్మిది తుఫాన్లలో రైతులకు రూ.20 వేల కోట్ల పంట నష్టం జరిగినా… ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ మాత్రం రూ.1,612 కోట్లు మాత్రమే. 2014–19 మధ్య చంద్రబాబు గారు రూ.3,700 కోట్లు ఇచ్చారు. వరి, పత్తి, వేరుశనగ, చెరకు పంటలకు రూ.25,000 వరకు నష్టపరిహారం ఇచ్చేలా నిర్ణయించారు. జగన్ కాలంలో ఇది రూ.15,000కి పడిపోయింది.”
కౌలు రైతుల పరిస్థితి గురించి మాట్లాడుతూ:
“వైసీపీ పాలనలో కేవలం 1.43 లక్షల కౌలు రైతులు మాత్రమే రైతు భరోసా పరిధిలోకి వచ్చారు. వీరికి రాష్ట్రం నుంచి ఇచ్చింది కేవలం రూ.7,500 మాత్రమే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 2024–25లో 9.13 లక్షల CC/RC కార్డులు మంజూరు చేసింది. ఈ పంట నమోదు పూర్తయ్యాక రబీ కాలంలో కౌలు రైతులకు రూ.20,000 రాష్ట్ర నిధుల నుంచే అందించబోతున్నాం,” అని చెప్పారు.
మద్దతు ధరల విషయమై:
2024–25లో మద్దతుది ధరల కోసం మొత్తం రూ.800 కోట్లు కేటాయించి, పోగాకుకు 271 కోట్లు, మామిడికి 261 కోట్లు, ఉల్లికి 125 కోట్లు, కోకో కు 14 కోట్లు, టొమాటో కి 12 కోట్లు మద్దతు ధరల కోసం ఖర్చు పెట్టాం అని మంత్రి తెలిపారు. రైతులకు చేయూత ఇవ్వడం మా బాధ్యత. జగన్ రెడ్డి కాలంలో రైతులపై చూపిన నిర్లక్ష్యం ఈ రాష్ట్రం ఎప్పటికీ మరవదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 60% నిధులను కూడా దుర్వినియోగం చేసిన దుర్మార్గుడు జగన్ అంటూ అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.
