టీటీడీ కీలక నిర్ణయం.. ఏకంగా 90 శాతం రాయితీ.. రూ.25 వేలు కట్టాల్సిన పనిలేదు.. రూ2,500 చాలు

0
IMG-20251220-WA0299

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు రాయితీపై మైక్ సెట్లు, గొడుగులు, విగ్రహాలను అందించాలని నిర్ణయించింది.

హిందూ ఆలయాలకు రాయితీపై రాతి, పంచలోహ విగ్రహాలు, మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రాలను టీటీడీ అందిస్తోంది. ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నిబంధనల మేరకు దరఖాస్తులను నింపి, డీడీ తీసి తమకు పంపాలని టీటీడీ కోరుతోంది.

మరోవైపు ఆలయాల్లో ఉపయోగించే మైక్ సెట్లను టీటీడీ రాయితీ మీద అందిస్తోంది. రూ.25 వేలు విలువ చేసే మైక్ సెట్‌ను ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం రాయితీతో 2500లకు అందిస్తున్నారు. ఇందుకు ఏపీకి చెందిన వారే అర్హులు. ఆసక్తి కలిగిన వారు 2 వేల 500 డీడీ తీసి పంపించాలి. అలాగే ఇతరులకు 50 శాతం రాయితీ అందిస్తున్నారు. వీరు రూ. 12,500 డీడీ తీసి పంపించాలి. ఈ డీడీలతో పాటుగా ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, తహశీల్దార్ / దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సిఫార్సు లేఖ, ఆలయం ఫొటో, ఆలయానికి సంబంధించిన కరెంట్ బిల్లు, దరఖాస్తుదారు ఆధార్ కార్డును కూడా జత చేయాలని టీటీడీ సూచించింది.

అలాగే హిందూ దేవాలయాలకు గొడుగులను కూడా టీటీడీ రాయితీతో అందిస్తోంది. రూ.14,500 విలువ చేసే గొడుగులను రూ.7,250 లకే అందిస్తోంది. అలాగే ఉచితంగా శేష వస్త్రాన్ని అందిస్తున్నారు. అలాగే హిందూ ఆలయాలకు రాతి, పంచలోహ విగ్రహాలను టీటీడీ అందిస్తోంది. వెంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారి రాతి విగ్రహాలు 5 అడుగులు, అంతకంటే తక్కువ ఎత్తు ఉంటే ఉచితంగా అందిస్తున్నారు. అలాగే మిగతా దేవతా విగ్రహాలకు 75 శాతం రాయితీ అందిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఉండే ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారికి ఉచితంగా రాతి విగ్రహాలు అందిస్తోంది టీటీడీ.

ఇక ఏపీ, తెలంగాణలలోని ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారికి పంచలోహ విగ్రహాలను 90 శాతం రాయితీతో, ఇతర సామాజిక వర్గాల వారికి 75 రాయితీతో తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తోంది. అలాగే విద్యా సంస్థలకు సరస్వతీ దేవీ రాతి విగ్రహాన్ని 50 శాతం రాయితీ మీద అందిస్తోంది. ఆశ్రమాలు, ట్రస్టులు, మఠాలకు 50 శాతం రాయితీతో దేవతా విగ్రహాలను అందిస్తోంది. ఆసక్తి కలిగిన వారు తమ దరఖాస్తులను కార్యనిర్వహణాధికారి, టిటిడి పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి అనే అడ్రస్‌కు పంపించాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది. మరిన్ని వివరాలకు 0877-2264276 అనే ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *