డిజిటల్ అరెస్టులపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణ.. తెలంగాణ సహా రాష్ట్రాలకు సుప్రీంనోటీసులు
ఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టుల మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ అరెస్టు మోసాలపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీబీఐ విచారణకు అవసరమైన అనుమతి, సమాచారం ఇచ్చి సహకరించాలని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. తమ వద్ద నమోదైన ఎఫ్ఎఆర్ వివరాలు సీబీఐకి అందిచాలని తెలిపింది. డిజిటల్ అరెస్టుల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పిల్ పై ఇవాళ విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి నేతృత్వంలోని బెంచ్ డిజిటల్ అరెస్ట్ మోసాలపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది.
ఆ పని ఎందుకు చేయడం లేదు ఆర్బీఐ కి నోటీసులు: రాష్ట్రాలతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సైతం నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక ప్రశ్నలు సంధించింది. సైబర్ మోసాలకు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీని ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జోక్యం చేసుకుని వివరాలు అందించాలని, డిజిటల్ అరెస్ట్ కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు సహకరించడంతో పాటు మోసం చేయడంలో సహకారం పౌరులను అందించిన బ్యాంకు అధికారులను సైతం గుర్తించాలని సీబీఐకి సూచించింది. దుర్వినియోగం అరికట్టేందుకు ఒక వ్యక్తికి అనేక సిమ్ లు కేటాయించకుండా టెలికాం ఆపరేటర్లు ఆదేశాలు ఇవ్వాలని టెలికాం మంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆన్ లైన్ ఫ్రాడ్స్ అడ్డుకునేదుకు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. దీనిపై కేంద్ర హోం, టెలికాం, ఆర్థిక సహా పలు శాఖళ స్పందన తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ ను ఆదేశించింది. ఇక విదేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్న నేరస్థులను పట్టుకునేందుకు ఇంటర్ పోల్ సాయం తీసుకోవాలని సీబీఐకి సూచించింది. ప్రజలను మోసం చేసే ఖాతాలను ఫ్రీజ్ చేసేలా సీబీఐతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీసు దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛ ఇవ్వాలని సూచించింది.
తెలంగాణలో సీబీఐకి నో ఎంట్రీ
తెలంగాణ రాష్ట్రంలో నేరుగా సీబీఐ వచ్చి దర్యాప్తు చేపట్టేందుకు ఇక్కడ అనుమతి లేదు. సీబీఐ ఎంట్రీ కోసం జనరల్ కన్సెంట్ ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దాంతో సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పని చేసింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐని కోరింది. తాజాగా డిజిటల్ అరెస్టుల విషయంలో తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
