ధాన్యం కొనుగోళ్లల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: సీఎం చంద్రబాబు

0
FB_IMG_1766514652820

అమరావతి: రైతులకు ప్రయోజనం కలిగించేలా రబీ – ఖరీఫ్ – రబీ పంటలకు సంబంధించిన క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ, ఉద్యానశాఖలను ఆదేశించారు. దీనికి అనుగుణంగానే పంటల హార్వెస్టింగ్, మార్కెటింగ్ జరిగేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ధాన్యం సేకరణ, వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్ పై సమీక్ష నిర్వహించారు. వర్చువలుగా మంత్రులు కె.అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఈ సమీక్షకు హజరయ్యారు. రబీ- ఖరీఫ్- రబీ సీజన్లలో ఎలాంటి పంటలు వేయాలి.. రైతులకు ఏది ప్రయోజనం అన్న అంశాలను రైతుల్లో అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. పంట ఉత్పత్తుల నాణ్యత పెంచటంతో పాటు కోత సమయంలోనూ తగిన సూచనలు ఇవ్వాలని అన్నారు. కోల్డ్ చైన్ సహా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను తరలించటంతో పాటు ప్రాసెసింగ్ పై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు పంట ఉత్పత్తులను తరలించేలా రైల్ కార్గో లాంటి లాజిస్టిక్స్ సౌకర్యాలను కల్పించాలని అన్నారు. వివిధ జిల్లాల్లో నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎదురవుతున్న బ్యాంకు గ్యారెంటీ సమస్యల్ని పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఈమేరకు సమీక్ష నుంచే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కన్వీనర్ తో ముఖ్యమంత్రి మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలని సీఎం బ్యాంకర్లను ఆదేశించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు విధానం మేరకు తక్షణమే చర్యలు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతుల నుంచి చేసే కొనుగోళ్లలో మిల్లర్లు ఎక్కడా అక్రమాలకు పాల్పడకుండా చూడాలని సీఎం సూచనలు జారీ చేశారు.

మామిడి రైతులకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగిస్తే చర్యలు

ఆర్ధిక కష్టాలు ఉన్నా మామిడి రైతులను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.184 కోట్లను రాయితీగా చెల్లింపులు చేసిందని.. ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా కేజీకి రూ.4 చొప్పున అదనపు ధర చెల్లిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల పట్ల ఉదారంగా ఉండాలని సీఎం కోరారు. రైతులను కాపాడుకోవాలనే మామిడికి అదనంగా రూ.4 ధర చెల్లిస్తుంటే కొందరు ఉద్దేశపూర్వకంగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా తన దృష్టికి వచ్చిందని… ఇలాంటి చర్యల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కొందరు వ్యక్తులు, కొన్ని ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల రైతులకు ఇబ్బందులు రాకూడదని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతులకు కలిగిన ఇబ్బందులను 10 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మామిడికి ధరలేక మార్కెట్లో ఉన్న ధరకే అక్కడి రైతులు విక్రయించుకోవాల్సి వస్తుందని… అందుకే ఏపీలోని మామిడి రైతులను కాపాడుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని అన్నారు. తోతాపురి మామిడి రైతులకు ప్రయోజనం కలిగించేలా మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను తీసుకువచ్చి ఓ ఎకోసిస్టంను తయారు చేస్తు్న్నామని సీఎం అన్నారు. జనవరిలో ఉద్యాన ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించాలని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖను ఆదేశించారు. ప్రస్తుతం పండ్ల ఉత్పత్తిలో దేశంలో ఏపీ నెంబర్ 1 గా ఉందని.. ప్రపంచంలోనే అత్యుత్తమ పండ్ల ఉత్పత్తి కేంద్రంగా ప్రకాశం సహా రాయలసీమ జిల్లాలు తయారు కావాలని ముఖ్యమంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *