బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం
పశ్చిమమధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం గడిచి
న 6 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశగా గంటకు 18 కి.మీ వేగంతో కదిలిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. సాయంత్రానికి గోపాల్‌పూర్‌కు దగ్గరగా ఒడిశా, ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందన్నారు.
దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో రేపు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు.
గురువారం సాయంత్రం 4 గంటల నాటికి శ్రీకాకుళం(జి) పలాసలో 183.7మమీ, మందసలో139.5మిమీ, నందిగాంలో 134.2మిమీ, కంచిలిలో 131.5మిమీ, రావివలసలో 100.7మిమీ , కొర్లంలో 96.7మిమీ, సంతబొమ్మాళిలో 88మిమీ కోటబొమ్మాళిలో 83మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందన్నారు.
వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందన్నారు కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు. కృష్ణా ప్రకాశం బ్యారేజి వద్ద 3.76 లక్షల క్యూసెక్కులు, గోదావరి ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 10.82 క్యూసెక్కులు ఉందన్నారు.పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదీపరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
