మొబైల్ టెక్నాలజీని అభివృద్ధికి ఉపయోగించండి : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
మొబైల్ టెక్నాలజీని అభివృద్ధికి ఉపయోగించండి
రాష్ట్రానికి గూగుల్ కంపెనీ రావడం విద్యార్థులకు సువర్ణావకాశం
మన దేశం మన రాష్ట్రం మన ఆవిష్కరణలు సదస్సులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు



విశాఖపట్నం/స్టీల్ ప్లాంట్: సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతూ అందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో, సెల్ ఫోన్స్ వల్ల విద్యార్థులకు ఎన్నో నష్టాలు ఉన్నాయని, వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. ‘మన దేశం మన రాష్ట్రం మన ఆవిష్కరణలు’ అంశంపై కె ఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని శ్రీ చైతన్య కళాశాల స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్స్‌లో వస్తున్న అసభ్య సన్నివేశాలు, చిత్రాలు, సంభాషణల కారణంగా విద్యార్థుల మనసు చెడు దారి వైపు మళ్ళుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విద్యార్థులలోనూ, తల్లిదండ్రులలోను అలాగే సమాజం మొత్తంలో ఆలోచన, చైతన్యం రావలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యా రంగం చాలా అభివృద్ధి చెందిందని, ఎన్నో ఉన్నతమైన కోర్సులు అందుబాటులోకి వచ్చాయని, విద్యార్థులు వారికి నచ్చిన కోర్సులు చదువుకుని అభివృద్ధిలోకి రావాలని అన్నారు.
రాష్ట్రానికి గూగుల్ కంపెనీ రావడం శుభ పరిణామం అని, ఆ కంపెనీ రావడం కోసం ముఖ్యమంత్రి కృషి అనిర్వచనీయమని కొనియాడారు. ఎన్నో దేశాలు, రాష్ట్రాలు ఇటువంటి కంపెనీల కోసం పోటీ పడుతున్నాయని, అటువంటి తరుణంలో మన రాష్ట్రానికి కంపెనీలు రావడం విద్యార్థులకు సువర్ణ అవకాశమని అన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని, అలాగే రాజకీయాలలోకి కూడా యువత రావాలని పిలుపునిచ్చారు. పరిశోధనల్లో విద్యార్థులు చూపిస్తున్న చొరవ ప్రశంసనీయమని అయ్యన్నపాత్రుడు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డీన్ రఘు కుమార్, ఏజీఎం శ్రీనివాసరావు, కె ఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ షణ్ముఖ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్. ఎస్. ఆర్. మూర్తి, జోనల్ హెడ్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇంటర్ మార్కుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మెమెంటోలు, మెడల్స్ అందజేశారు.
