రామచంద్రపురం రెవిన్యూ డివిజన్ యధాతధంగా కొనసాగుతుంది: ప్రజలు ఆందోళన చెందవద్దు..మంత్రి సుభాష్
అమరావతి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రెవిన్యూ డివిజన్, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం (డీఎస్పీ ఆఫీస్ ) ఎట్టి పరిస్థితిలో యధాతధంగా రామచంద్రపురం కేంద్రంగా కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు హామీ ఇచ్చారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రి సుభాష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజవర్గంలో ఉన్న పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ రామచంద్రపురం రెవిన్యూ డివిజన్, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయాలు అక్కడే కొనసాగుతాయని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళనలు చెందవద్దని భరోసా ఇచ్చారు. అలాగే రామచంద్రపురం నియోజవర్గం అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయిస్తానని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టమైన హామీ ఇవ్వడంతో మంత్రి వాసంశెట్టి సుభాష్ సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందవద్దని, యధావిధిగా అక్కడే పరిపాలన కొనసాగుతుందని మంత్రి సుభాష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం రైతాంగం సమస్యలపై మాట్లాడుతూ రైతుల అభీష్టం మేరకు ధాన్యం సేకరణ, కొనుగోలు 50 కిలోమీటర్ల వరకూ అవకాశం కల్పించామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతోపాటు రైస్ మిల్లర్లు అందరికీ అధికార యంత్రాంగం ద్వారా తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. రామచంద్రపురం రెవిన్యూ డివిజన్ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలను నమ్మవద్దని ఈ సందర్భంగా మంత్రి సుభాష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
