రేపు అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సహా పలు కార్యక్రమాలకు హాజరు
అమరావతి: ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులతో ముఖాముఖి అవుతారు. ప్రజావేదిక సభ, పార్టీ కేడర్‌తో భేటీ, మత్స్యకారులతో సమావేశం, అలాగే మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి విగ్రహావిష్కరణ వంటి కార్యక్రమాల్లోనూ ముఖ్యమంత్రి పాల్గొంటారు. శనివారం ఉదయం అమరావతి నుంచి నేరుగా హెలికాప్టర్ లో అనకాపల్లి జిల్లా చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు కశింకోట మండలం తల్లపాలెంలో విద్యార్థులతో మాట్లాడతారు. ఆ తర్వాత బంగారాయ్యపేట గ్రామంలోని సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ పరిశీలిస్తారు. అనంతరం “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం తల్లపాలెంలోని ప్రజావేదిక సభలో పాల్గొంటారు. తర్వాత ఉగ్గినపాలెం గ్రామంలో నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం స్థానిక మత్స్యకారులతోనూ వివిధ అంశాలపై మాట్లాడతారు. సాయంత్రం అనకాపల్లిలో అటల్ బిహారి వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తిరిగి రాత్రికి అమరావతికి చేరుకుంటారు.
