రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ జరగాలి : జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
161 కొనుగోలు కేంద్రాల్లో పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశం
నెల్లూరు: జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.


కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి రైతులు, రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థంగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు, తేమ శాతం, మద్దతు ధర, గన్నీబ్యాగ్స్ సరఫరా వంటి అంశాలపై రైతులు, మిల్లర్లతో కలెక్టర్, ఎమ్మెల్యే చర్చించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కూడా వారు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ* ప్రస్తుతం జిల్లాలో ఏర్పాటు చేసిన 161 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గోనె సంచులను (గన్నీ బ్యాగ్స్) సరిపడా నిల్వ ఉంచాలని సూచించారు. తేమ శాతం, తూకాలు వంటి అంశాలను కచ్చితంగా లెక్కించేలా సిబ్బందికి పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని తెలిపారు. ధాన్యం రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి జిపిఎస్ సదుపాయం కలిగిన వాహనాలను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్‌కు సూచించారు.
*కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ* రైతులు, రైస్ మిల్లర్లు పరస్పర సమన్వయంతో ప్రశాంతంగా ధాన్యం సేకరణ ప్రక్రియను నిర్వహించాలని కోరారు. రైతుల సౌకర్యార్థం అవసరమైతే కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని సూచించారు. క్షేత్రస్థాయిలో గోనె సంచుల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సేకరించిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించేందుకు తగిన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డీసీవో బొజ్జా గుర్రప్ప, డీఎం సివిల్ సప్లయిస్ అర్ణునరావు, డీఎస్‌వో లీలారాణి, రైస్ మిల్లర్లు, రైతులు పాల్గొన్నారు.
