రైతుల్ని మోసం చేసిన చరిత్ర జగన్‌ది – మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
రైతుల పేరుతో జగన్ అబద్ధాల రాజకీయాలు
రైతుల కష్టాలపై రాజకీయాలు చేయొద్దని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరిక
రైతుల కోసం పనిచేయని వారు ఇప్పుడు విమర్శలా? అంటూ మండిపాటు
గత ఐదేళ్లు రైతులు గుర్తుకురాలేదు… ఇప్పుడు ఈ నాటకం ఎందుకు?
రైతన్నల పేరుతో జగన్ రాజకీయ డ్రామాలు ఇక సాగవు
అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయం, రైతుల సమస్యలపై ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరితమైనవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రైతుల పేరుతో అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం జగన్‌కు అలవాటైపోయిందని ఆయన ఓ ప్రకటనలో ఘాటుగా విమర్శించారు. గత ఐదేళ్లలో రైతు భరోసా పేరుతో పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్, తన పాలనలోనే రైతులకు ఇవ్వాల్సిన అనేక చెల్లింపులను నిలిపివేసిన విషయం ప్రజలు మరిచిపోలేదని మంత్రి అన్నారు. ఇప్పుడు అదే విషయంపై నైతిక హక్కు ఉన్నట్లు మాట్లాడటం జగన్ రాజకీయ కపటత్వానికి నిదర్శనమన్నారు. రైతులకు న్యాయం చేయడంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు సాగుతోందని చెప్పారు.
గత ప్రభుత్వ కాలంలో రైతు భరోసా పేరుతో రాష్ట్రం రూ.13,500 ఇస్తామని ప్రకటించినప్పటికీ రాష్ట్రం నుంచి కేవలం రూ.7,500 మాత్రమే ఇచ్చి, కేంద్రం ఇచ్చిన రూ.6,000ను కలిపి మొత్తం రాష్ట్రం ఇచ్చినట్లుగా ప్రకటించారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం సంవత్సరానికి రూ.20,000ను మూడు విడతలుగా అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెండు విడతలుగా మొత్తం రూ.6,309.44 కోట్లు రైతు కుటుంబాలకు పంపిణీ చేశామని, ఈ నెల 13వ తేదీన మూడో విడత నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పంట బీమా ప్రీమియం చెల్లింపుల విషయంలో జగన్ వాస్తవాలను పూర్తిగా వక్రీకరిస్తున్నారని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో బీమా ప్రీమియంలు చెల్లించకపోవడంతో మూడు సీజన్లకు సంబంధించిన రూ.1,990.06 కోట్ల ఆర్థిక భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడిందని ఆయన వెల్లడించారు. ఇటీవల సంభవించిన తుఫాన్లకు సంబంధించి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికే రూ.25 కోట్లు, రూ.34 కోట్లు, రూ.310 కోట్ల వరకు రైతులకు నష్టపరిహారం చెల్లించిందని తెలిపారు. ఇటీవల వచ్చిన మొందా తుఫాన్‌కు సంబంధించిన నష్టాల సర్వే పూర్తయిందని, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం అందజేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
2025–26 సంవత్సరానికి ప్రభుత్వం రూ.300 కోట్లు బడ్జెట్లో కేటాయించినప్పటికీ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే సుమారు రూ.588 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. 2019–24 మధ్య రూ.2,140 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం రూ.1,475 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రూ.7,700 కోట్లు ఖర్చు చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారని మంత్రి విమర్శించారు. మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటల ధరల విషయంలో కూడా జగన్ రాజకీయ నాటకం ఆడుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతులకు కనీస మద్దతు ధరలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, వాటిని ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకుండా ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. రైతులకు మేలు చేశామని చెప్పుకునే జగన్ పాలనలోనే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నదని మంత్రి గుర్తు చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు మాట్లాడటం రాజకీయ స్వార్థమే తప్ప రైతుల పట్ల చిత్తశుద్ధి కాదన్నారు. రైతుల పేరుతో అబద్ధాల ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టే రోజులు పోయాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అసత్య ప్రచారాలకు రైతులు కూడా సమాధానం చెబుతారని ఆయన స్పష్టం చేశారు. 2014 నుండి2019 మధ్యకాలంలో 6.58 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 5.92 లక్షల మంది రైతులకు బిందు, తుంపర్ సేద్యాన్ని రూ 2786 కోట్లతో అమలు చేయడం జరిగింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో 2.94 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రూ 1984 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేశారు. ఐదు సంవత్సర కాలంలో రెండు సంవత్సరాలు 2020-22 సంవత్సరాలలో ఈ పథకం అమలను పూర్తిగా నిలిపివేశారు.అంతేకాకుండా ఈ పథకం అమలకు సంబంధించి రూ 1166 కోట్లు బకాయిలను మిగిల్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు 2.33లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 2.10 లక్షల మంది రైతులకు, మైక్రో ఇరిగేషన్ పథకాన్ని రూ 1857 కోట్లు వెచ్చించి విస్తరించడం జరిగింది .
వరి పంటకు ఇన్పుట్ సబ్సిడీని రూ.17,000 నుంచి రూ.25,000కు కూటమి ప్రభుత్వం పెంచిందని చెప్పారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు సుమారు 2 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా అందించామని వెల్లడించారు. గత ప్రభుత్వ కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న 81 మంది రైతుల కుటుంబాలకు చెల్లించకుండా మిగిలిపోయిన రూ.5.67 కోట్ల నష్టపరిహారాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అదేవిధంగా మరో 214 మంది రైతుల కుటుంబాలకు రూ.14.98 కోట్ల నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉద్యానవన పంటలు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు కూడా రూ.50 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా అందించామని చెప్పారు. అదేవిధంగా గతంలో సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన 1.21 లక్షల మంది రైతులకు రూ.147.34 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు. అరకు ప్రాంతంలోని కాఫీ తోటల్లో కాఫీ బెర్రీ బోరర్ వ్యాధి వలన నష్టపోయిన 81 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా రూ.7,23,825 ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
