వైసీపీ హింసాత్మక సంస్కృతిపై ఘాటు గా స్పందించిన: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
అమరావతి/విజయవాడ: మారణాయుధాలు పట్టుకుని బహిరంగంగా ప్రదర్శనలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదమని, ఇటువంటి చర్యలపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు చట్టపరంగా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు వేట కొడవళ్లు వంటి మారణాయుధాలతో ప్రదర్శనలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం శోచనీయమని పల్లా మండిపడ్డారు. ఇటువంటి హింసాత్మక ప్రదర్శనలు రాష్ట్ర శాంతి భద్రతలకు భంగం కలిగించడమే కాకుండా, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, స్పష్టమైన విజన్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడిదారులు, ప్రముఖ కంపెనీలు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతి, భద్రత, స్థిరమైన పాలన ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చంద్రబాబు నాయుడు స్పష్టమైన విధానాలతో ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు.
పెట్టుబడిదారులను భయపెట్టే కుట్ర లో జగన్ ముఠా
వైఎస్సార్సీపీ, జగన్ ముఠా హింసాత్మక ప్రదర్శనల ద్వారా రాష్ట్రాన్ని అశాంతి వైపు నెట్టే ప్రయత్నం చేస్తోందని పల్లా అన్నారు. పెట్టుబడిదారులను భయపెట్టే కుట్రలో భాగంగానే ఈ తరహా మారణాయుధాల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని అన్నారు. జగన్‌కు ఉన్న నేర చరిత్ర కారణంగానే ఇలాంటి సంస్కృతిని ఆయన ప్రోత్సహిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.
‘రఫా రఫా నరుకుతాం’ ప్లకార్డులు ప్రజలు గమనిస్తున్నారు
తమకు నచ్చని వారిని “రఫా రఫా నరుకుతాం” అంటూ ప్లకార్డులు ప్రదర్శించడం వైసీపీ శ్రేణుల మానసిక స్థితిని బహిర్గతం చేస్తోందని పల్లా గారు అన్నారు. ఇటువంటి బెదిరింపులు ప్రజాస్వామ్యంలో అనుమతించదగ్గవి కాదని స్పష్టం చేశారు.
జగన్, వైసీపీ శ్రేణుల తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని, కానీ ఈ హింసాత్మక రాజకీయ సంస్కృతిని మాత్రం తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని పల్లా శ్రీనివాసరావు తేల్చి చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలను కఠినంగా అణచివేయాలని కోరారు.
అధికారంలోకి వచ్చేస్తున్నామని జగన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేసిన పల్లా గారు, ప్రజలు ఇప్పటికే ఆయన హింసాత్మక పాలనను తిరస్కరించారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని హింస, భయాందోళనల వైపు నెట్టే రాజకీయాలకు ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వబోరని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే చంద్రబాబు నాయుడు విజన్‌కు ప్రజలు అండగా ఉన్నారని స్పష్టం చేశారు.
