స్త్రీ శక్తి ఎఫెక్ట్..ఏపీలో భారీగా పెరగనున్న ఆర్టీసీ బస్సులు

0

స్త్రీ శక్తి ఎఫెక్ట్..ఏపీలో భారీగా పెరగనున్న ఆర్టీసీ బస్సులు

స్త్రీ శక్తి పథకంతో పెరిగిన ప్రయాణికుల రద్దీ

రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సుల కొనుగోలుకు చర్యలు

2028 నాటికి రాష్ట్రంలోని అన్ని డిపోలకు ఎలక్ట్రిక్ బస్సులు

సిబ్బంది కొరతను అధిగమించేందుకు అన్‌కాల్ డ్రైవర్ల నియామకం

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈడీ బ్రహ్మానందరెడ్డి హామీ

ఉమ్మడి విజయనగరం జిల్లాకు 98 కొత్త బస్సులు కేటాయింపు

అమరావతి: ఏపీలో స్త్రీ శక్తి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ జోన్‌-1 ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఆయన పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోను సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ… ఉమ్మడి విజయనగరం జిల్లాకు 98 కొత్త బస్సులు రానున్నాయని, దీనివల్ల ప్రయాణికుల ఇబ్బందులు చాలావరకు తగ్గుతాయని అన్నారు. “స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే మహిళల ఉచిత ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు” అని ఆయన స్పష్టం చేశారు. అలాగే 2028 నాటికి రాష్ట్రంలోని అన్ని డిపోలకు దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని, పాత బస్సులను ఆధునిక హంగులతో మెరుగుపరుస్తున్నామని వివరించారు.

ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల కొరత ఉన్న మాట వాస్తవమేనని ఈడీ అంగీకరించారు. ఈ సమస్యను తాత్కాలికంగా అధిగమించడానికి అన్‌కాల్ డ్రైవర్ల సేవలను వినియోగించుకుంటున్నామని, త్వరలోనే శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పార్వతీపురం జిల్లాకు అదనపు బస్సులు కావాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని ఆయన పేర్కొన్నారు.

అనంతరం ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు ఈడీని కలిసి తమ సమస్యలను విన్నవించారు. డ్రైవర్లు, కండక్టర్లపై పనిభారం తగ్గించాలని, డిపోలో ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను విన్న బ్రహ్మానందరెడ్డి, సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపితే వాటిని పరిశీలించి పరిష్కార మార్గాలు చూపుతామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *